ఓ వైపు దాసరి, బాపు వంటి సీనియర్ల తోనూ, మరోవైపు పరుచూరి మురళి వంటి ఈ
తరం దర్శకులతోనూ విభిన్న తరహా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్తో ఉన్నారు నట ‘సింహా’ం- నందమూరి బాలకృష్ణ. తనకెప్పుడూ ఇమేజ్ అడ్డుగోడ కాలేదని, తన స్పీడ్ను అందుకోవడం ఎవరివల్లా సాధ్యపడదని కుండ బద్దలుగొట్టినట్టు చెప్పారాయన. దాసరి దర్శకత్వంలో తను నటించిన ‘పరమవీరచక్ర’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు...
‘సింహా’లో ద్విపాత్రలు పోషించారు. మళ్లీ వెంటనే ‘పరమవీరచక్ర’లో కూడా రెండు పాత్రలు పోషించడం ఎలా అనిపించింది?కథను బట్టే పాత్రలు పుడుతుంటాయి. ఇందులో నేను ఆర్మీ ఆఫీసర్గానూ, సినిమా హీరోగానూ కనిపిస్తాను. ఒకదానికొకటి పోలికలేని పాత్రలు. ‘కళ కళ కోసం కాదు... సమాజం కోసం’ అని నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు. దానికి ప్రతిబింబంగా సినిమా హీరో పాత్ర నిలుస్తుంది. ఇక ఆర్మీ ఆఫీసర్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది.
‘బొబ్బిలిపులి’ మళ్లీ తీశారని కొందరు, దానికి సీక్వెల్ అని మరికొందరు అనుకుంటున్నారు. నిజమేనా?నేను దాసరిగారితో చేయడం, అలాగే మిలట్రీ నేపథ్యం ఉండడంతో సహజంగానే అలాంటి భావాలు కలుగుతాయి. అయితే ఇది ‘బొబ్బిలిపులి’కి రీమేక్ కాదు, సీక్వెలూ కాదు. ఇదొక భిన్నమైన కథ. సందేశానికీ స్థానం ఉంది.
ఎన్టీఆర్తో బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు వంటి సంచలన చిత్రాలు చేసిన దాసరితో ఇంతకు ముందెప్పుడూ సినిమా అనుకోలేదా?‘శివరంజని’లో నేను హీరోగా చేయాలి. అప్పటికి నా చదువు పూర్తి కాకపోవడంతో నాన్నగారు అనుమతి ఇవ్వలేదు. యాదృచ్ఛికమో, కాకతాళీయమో కానీ ఆయన 150వ చిత్రంలో చేసే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడం బ్రహ్మాండంగా అనిపించింది. మా మధ్య మొదట్నుంచీ మంచి అనుబంధమే ఉంది. ఇటీవల వరదబాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ తరఫున తలపెట్టిన భారీ కార్యక్రమం సమయంలో ఆయనతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. ఈ కథ చెప్పినప్పుడు ఏవో చిన్న చిన్న సూచనలు చేశాను. నూటయాభై చిత్రాల దర్శకుడై ఉండి కూడా వయసులో చిన్నవాణ్ణైన నేను చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారాయన. హేట్సాప్ టు హిమ్. బిగ్ స్పాన్ ఉన్న ఈ సినిమాని 80 రోజుల్లో పూర్తి చేశాం. 115 రోల్స్ మాత్రమే ఎక్స్పోజ్ చేశారు. అలాగని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
తొలిసారిగా రావణబ్రహ్మ, కొమరమ్భీమ్ పాత్రల్లో కనిపించడం ఎలా అనిపించింది?మాటల్లో చెప్పలేని అనుభూతి అది. ‘సీతారామకళ్యాణం’లో రావణునిగా నాన్నగారి నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఈ పాత్ర షోషణలో ఆయన శైలిని, నా శైలిని కలగలిపి చేశాను. నాన్నగారు వాడిన ఆభరణాలనే ఉపయోగించాను. ఇక కొమరమ్భీమ్ గెటప్ విషయానికొస్తే... ‘భారతంలో బాలచంద్రుడు’లో స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి, సుభాష్చంద్రబోస్ పాత్రలు చేశాను. ఆదిలాబాద్ జిల్లాలో గోండుల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడు కొమరమ్భీమ్ పాత్ర వేసే అవకాశం రావడం నిజంగా నాకో తీయని అనుభూతి.
రావణబ్రహ్మగా పూర్తిస్థాయి సినిమా చేసే ఆలోచన ఉందా?ఈ గెటప్లో ఉన్నప్పుడు అలాంటి ఆలోచన వచ్చింది. నాన్నగారు అప్పట్లో ‘సీతారామకళ్యాణం’ తీసి తల్లిదండ్రులకు అంకితమిచ్చినట్టుగానే, నేనూ ఓ సినిమా తీసి అంకితమివ్వాలని ఉంది.
మీ సంక్రాంతి ఘన విజయాల జాబితాలో ‘పరవీరచక్ర’ చేరుతుందంటారా?సంక్రాంతికి వచ్చిన నా సినిమాల్లో ఎక్కువ ఘనవిజయాలే. పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, సరసింహనాయుడు, లక్ష్మీనరసింహలా ‘పరమవీరచక్ర’ ఈ సంక్రాంతికి వీరవిజృంభణ, స్వైర విహారం చేయడం ఖాయం.
‘సింహా’ తరువాత మీ చిత్రాలపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎలాంటి ప్రణాళికను అనుసరిస్తున్నారు?ముప్ఫైఐదేళ్లుగా పరిశ్రమలో అన్ని రకాల పాత్రలూ చేశాను. నాకెప్పుడూ ఇమేజ్ అనేది ప్రతిబంధకం కాలేదు. ఫలానా విధంగా చేయాలని అనుకుంటే ఎంతటి సాహసానికైనా పూనుకుంటాను. ఎవరో వచ్చి మిమ్మల్ని కొత్తగా చూపిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. అలాంటివాళ్లను దగ్గరక్కూడా రానివ్వను. అందుకే నా మైండ్సెట్కు దగ్గరైన దర్శకులతోనే పనిచేస్తాను. నా ఇమేజ్ను ఎంతవరకూ వాడుకోవాలనేది నా చేతుల్లో ఉంది. నా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారనేది గమనిస్తే చాలు. కథ మమ్మల్ని డామినేట్ చేసినా ఫర్వాలేదు కానీ, టెక్నిక్ మాత్రం ఎప్పుడూ మమ్మల్ని డామినేట్ చేయకూడదు.
- పులగం చిన్నారాయణ
100వ సినిమా స్పెషలేపరమవీరచక్ర 94వ చిత్రం. నా వందో సినిమా స్పెషల్గానే ఉంటుంది. ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కాబట్టి త్వరగానే వంద పూర్తవుతుంది. నన్ను చూసి మిగతావాళ్లు కూడా ఎక్కువ సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. నాకు కుదిరినట్టుగా అందరికీ కుదరకపోవచ్చుకూడా. నా ఇన్వాల్వ్మెంట్ వేగంగా ఉంటుంది. దర్శకుడి మీదే పూర్తి బాధ్యత వదిలేయను. ఇక గెటప్స్ ప్లానింగ్ నాదే. వేరేవాళ్లు అలాంటి గెటప్స్ వేసినా చూడరు.